తిరుపతి, ఆగస్టు 3, 2026: తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ ఆధ్వర్యంలో 72వ జాతీయ నాటకోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఆరేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక నాటకోత్సవాలకు టీటీడీ ₹25 లక్షల ఆర్థిక సహాయం అందించింది.
కళలు, సంస్కృతిని ప్రోత్సహిస్తున్న టీటీడీ
ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ భారతీయ కళలు, సంస్కృతి పరిరక్షణకు టీటీడీ నిరంతరం ప్రోత్సాహం అందిస్తోందన్నారు.
ఆరేళ్ల విరామం తర్వాత నాటకోత్సవాలు తిరిగి నిర్వహించేందుకు ₹25 లక్షల ఆర్థిక సహాయం అందించిన టీటీడీని ఆయన అభినందించారు.
భవిష్యత్తులోనూ కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలకు టీటీడీ తన సహకారాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
పౌరాణిక, సాంఘిక నాటకాలను పునరుద్ధరించాలి
ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ శ్రీమతి సుగుణమ్మ మాట్లాడుతూ, కళాభిమానులు 10 రోజుల పాటు జరిగే జాతీయ నాటకోత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తిరుపతిలో పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలను క్రమం తప్పకుండా నిర్వహించే సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించాలని సూచించారు.
కళాకారులను ఆదరిస్తేనే కళలు వికసిస్తాయి
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ కళాకారులను గౌరవించి, ప్రోత్సహించే సమాజంలోనే కళలు, సంస్కృతి వికసిస్తాయని పేర్కొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి. రవి మాట్లాడుతూ సంగీతం, నాటకం, భారతీయ సంప్రదాయ కళలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ వివిధ ప్రాజెక్టులు, సంస్థల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ప్రారంభ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కళాకారులు, కళాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు