తిరుపతి, అక్టోబర్ 27, 2026: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.
డిసెంబర్ 5న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 6 నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
ఆలయం, భక్తుల సౌకర్యాల పరిశీలన
మంగళవారం జేఈవో ఆలయ ప్రాంగణం, వాహన మండపం, నాలుగు మాడ వీధులు, పార్కింగ్ ప్రాంతాలు, క్యూలైన్లు, పుష్కరిణి, భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు.
భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. హోల్డింగ్ పాయింట్లు, క్యూలైన్లు, అన్నప్రసాదం పంపిణీ, లడ్డూ కౌంటర్లు, టికెట్ కౌంటర్ల వద్ద తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
గరుడ వాహనం, పంచమి తీర్థానికి ప్రత్యేక ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన గరుడ వాహనం, గజ వాహనం, పంచమి తీర్థం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జేఈవో సూచించారు.
అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలని సూచించారు.
బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని భక్తులకు ఆహ్వానం
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని డా. ఎ. శరత్ ఆహ్వానించారు.
ఈ పరిశీలనలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవోలు శ్రీ హరినాథ్, శ్రీ సెల్వం, ఎస్‌ఈ శ్రీ వెంకటేశ్వర్లు, వీజీవో శ్రీ గిరిధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు